Sunday, February 22, 2009

వేమన శతకం - తొమ్మిదవ బాగం

అంతరంగమందు నపరాధములు చేసి
మంచివానివలెనె మనుజుడుండు
ఇతరు లెరుగకున్న నీశ్వరుడెరుగడా?
విశ్వదాభిరామ వినురవేమ.


బావం :: మోసకారి ఆయున మనుజుడు తన అంతరంగమందు మిక్కిలి అపరాధములు చేసినను కూడా బాహ్య ప్రపంచముకు చాలా బుద్డిమంతుని వలె కనిపించును.
ఈ విషయం ఇతరులు గ్రహించలేకపోయునప్పటికీ ఈశ్వరుడు తప్పకుండా గుర్తిస్తాడు.
-------౦౦౦-------
 
కల్లుకుండకెన్ని ఘనభూషణము లిడ్డ 
అందులోని కంపు చిందులిడదె?
తులవ పదవిగొన్న దొలి గుణమేమగు?
విశ్వదాభిరామ వినురవేమ.
బావం ::  గొప్ప  గొప్ప ఆభరణములతో అలంకరించినా కళ్ళుకుండ నుంచి వచ్చే వాసన బాగుండాదు కదా!  చెడ్డవాడు  ఉన్నత పదవులు అలంకరించినా గుణం మారదు.
-------000-------
 
కానివాని తోడ గలసి మెలంగిన 
హానివచ్చు నెంతవానికైన
కాకిగూడి హంస కష్టంబు పొందదా?
విశ్వదాభిరామ వినురవేమ.
బావం ::  అర్హత లేనివారితో స్నేహం చేయడంవల్ల  ఎంత గొప్పవారికైనా  కష్టాలు కలుగుతాయి. కాకితో మితృత్వం చేసి హంస కష్టాలపాలు ఆయునట్టు.






Sunday, February 15, 2009

సుమతీ శతకం - ఎనిమిదవ బాగం

ఒల్లని సతి నొల్లని పతి,
నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే
గొల్లండు, కాక ధరలో
గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ.

బావం :: తన్ను ప్రేమించని భార్యను, యజమానుని, స్నేహితుని విడిచిపెట్టుటకు అంగీకరింపనివాడే వెర్రిగొల్లవాడు.కాని జాతిచేత గొల్లవాదైనంత మాత్రమున గుణములయందు వెర్రి గొల్లవాడు కాదు.
-------000-------

ఓడల బండ్లును వచ్చును,
ఓడలు నాబండ్లమీద నొప్పుగ వచ్చున్‌,
ఓడలు బండ్లును వలనే
వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ.

బావం :: నావలమీద బండ్లును, బండ్లమీద నావలును వచ్చునట్లుగనే భాగ్యవంతులకు దారిద్ర్యము, దరిద్రులకు భాగ్యమును పర్యాయముగా కలుగుచుండును.
-------000-------

కడు బలవంతుడైనను
బుడమిని బ్రాయంపుటాలి బుట్టిన యింటన్‌
దడవుండ నిచ్చెనేనియు
బడుపుగ నంగడికి దానె బంపుట సుమతీ.

బావం :: ఎంత సమర్ధత కలవాడైనను యవ్వనమందున్న భార్యను చిరకాలము పుట్టినయింట నుండనిచ్చినచోతానే స్వయముగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.

Wednesday, February 11, 2009

సుమతీ శతకం - ఏడవ బాగం

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్‌
తెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.

బావం :: చెరువునిండా నీరుచేరగనే వేలకొలది కప్పలందులోనికి ఏ విధముగా చేరుకొనునో సంపద కలిగిన బంధువులెక్కువగా జేరుకొందురు.
-------000-------

ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ.

బావం :: ఈ భూమి పైన పచ్చికాయలు ఏరి తినకుము, చుట్టములను ధూషింపకుము, యుధ్ధమునుండి వెనుదిరిగి పారిపోకుము, పెద్దల మాటను జవదాటకుము తప్పు సుమా.
-------000-------

ఒక యూరికి నొక కరణము,
నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్‌,
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ.

బావం :: ఒక గ్రామమునకు ఒక లేఖరి, ఒక ధర్మాధికారి యుండవలెను. అట్లు కాక పైన చెప్పబడినవారు పెక్కుమందియైనచో అనేకమైన గంధరగోళములు పుట్టి సమస్తమును చెడిపోవుట సహజము.

Friday, February 6, 2009

సుమతీ శతకం - ఆరవ బాగం

ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ.

బావం :: చెఱకుగడ మొట్టమొదట తియ్యగానుండి, చివరకు పోయిన కొలది మధ్య మధ్య చప్పగా నేవిధమున నుండునో ఆ విధముగా పోల్చి చూడగా మోసగాడైన దుర్మార్గునితోడి స్నేహము మొదట ఇంపుగా నున్ననుచివరకు తప్పులను వెదకుటకు ప్రారంభించునుగదా.
-------000-------

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.

బావం :: ఏ సమయమునకు ఏదేది అవసరమో తెలుసుకొని, అప్పటికా మాటలు పల్కి ఇతరుల మనస్సులను బాధపెట్టక తాను బాధనుపడక తప్పించుకొని తిరుగువాడే సుమా ధన్యాత్ముడు.
-------000-------

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్‌
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ.

బావం :: నల్లత్రాచుయొక్క పడగనీడను నివసించు కప్ప బ్రతుకెంత అస్థిరమైనదో ఆ విధముగనే ఎల్లప్పుడు దోషములనువెదకు యజమానుని సేవించువాడి బ్రతుకును ప్రాణభయముతో కూడినది.

Saturday, January 31, 2009

సుమతీ శతకం -ఐదవ బాగం

ఉత్తమగుణములు నీచున
కెత్తెఱగున గలుగ నేర్చు,
నెయ్యెడలం దానెత్తిచ్చి కరగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ.

బావం : బంగారమునకు సమానమైన యెత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లు కానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏవిధముగను మంచి గుణములు కలుగనేరవు.
-------000-------

ఉదకము ద్రావెడు హయమును,
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌,
మొదవు కడ నున్న వృషభము,
జదువని యానీచు గడకు జనకుర సుమతీ.

బావం : నీరు త్రాగెడు గుఱ్ఱము కడకును, క్రొవ్వుచే విజృంబించు మదపుటేనుగుకడకును, ఆవుకడనున్న ఆబోతు దగ్గరకును,విద్య నేర్వని అల్పుని కడకును వెళ్ళకుము.
-------000-------

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.

బావం : మేలు చేసినవానికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి లోగడ వాడు చేసిన దోషములులెక్క చేయక ఉపకారము చేయువాడే నేర్పుగలవాడు.

Wednesday, January 21, 2009

సుమతీ శతకం - నాల్గవ బాగం

ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
‌మెచ్చునదే నేర్చు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ.

బావం : భూమియందు ధనము నొసగునదియే విద్య. యుద్ధభూమియందు ప్రవేశించునదే పౌరుషము. మంచి కవిశ్రేష్టులు మెచ్చుకున్నట్టిదే నేర్పరితనము. తగవునకు వచ్చునదియే హాని.
-------000-------

ఇమ్ముగ జదువని నోరును,
నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్‌,
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ.

బావం : ఇంపుగా పఠింపని నోరును, అమ్మయని పిలచి అన్నము అడుగనినోరును, తమ్ముడాయని పిలువనినోరును, కుమ్మరివాడు మన్నుత్రవ్విన గోయీవంటిది సుమా.
-------000-------

ఉడుముండదె నూరేండ్లును,
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌,
మడువున గొక్కెర యుండదె,
కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ

బావం : ఉడుము నూరేండ్లును, పాము పదివందల ఏండ్లును, కొంగ చెరువులో చిరకాలము జీవించుచున్నవి.వాని జీవితములన్నియు నిరుపయోగములు. మానవుని జీవిత మట్టిదికాక ధర్మార్ధకామ మోక్షాసక్తితోకూడినది కావలెను.

Friday, January 16, 2009

సుమతీ శతకం - మూడవ బాగం

అల్లుని మంచితనంబు,
గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్‌,
బొల్లున దంచిన బియ్యము,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ.

బావం: అల్లుని మంచితనమును, గొల్లవాని పాండిత్య జ్ఞానమును, ఆడుదానియందు నిజమును, పొల్లు ధాన్యములో బియ్యమును,తెల్లని రంగు కాకులును లోకములో నుండవు.
-------000-------

ఆకొన్న కూడె యమృతము,
తాకొంచక నిచ్చువాఙ్డె దాత ధరిత్రిన్‌,
సోకోర్చువాడె మనుజుడు,
తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ.

బావం: లోకమునందు ఆకలి సమయమున అన్నమే అమృతము. బాధ నొందకుండా నిచ్చువాడే దాత.ఆవేశమును ఓర్చుకొనువాడే మానవుడు. ధైర్యం కలవాడే వంశ శ్రేష్టుడు.
-------000-------

ఆకలి యుడుగని కడుపును,
వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్‌,
బ్రాకొన్న నూతి యుదకము,
మేకల పాడియును రోత మేదిని సుమతీ.

బావం: భూమియందు ఆకలి తీరని భోజనం, గర్భము వచ్చిన జారస్త్రీ యొక్క వ్యభిచారమును విడువని బ్రతుకును, పాచిపట్టిన బావి నీళ్ళును, మేకల పాడియు రోత పుట్టించును.