Saturday, January 31, 2009

సుమతీ శతకం -ఐదవ బాగం

ఉత్తమగుణములు నీచున
కెత్తెఱగున గలుగ నేర్చు,
నెయ్యెడలం దానెత్తిచ్చి కరగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ.

బావం : బంగారమునకు సమానమైన యెత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లు కానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏవిధముగను మంచి గుణములు కలుగనేరవు.
-------000-------

ఉదకము ద్రావెడు హయమును,
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌,
మొదవు కడ నున్న వృషభము,
జదువని యానీచు గడకు జనకుర సుమతీ.

బావం : నీరు త్రాగెడు గుఱ్ఱము కడకును, క్రొవ్వుచే విజృంబించు మదపుటేనుగుకడకును, ఆవుకడనున్న ఆబోతు దగ్గరకును,విద్య నేర్వని అల్పుని కడకును వెళ్ళకుము.
-------000-------

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.

బావం : మేలు చేసినవానికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి లోగడ వాడు చేసిన దోషములులెక్క చేయక ఉపకారము చేయువాడే నేర్పుగలవాడు.

Wednesday, January 21, 2009

సుమతీ శతకం - నాల్గవ బాగం

ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
‌మెచ్చునదే నేర్చు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ.

బావం : భూమియందు ధనము నొసగునదియే విద్య. యుద్ధభూమియందు ప్రవేశించునదే పౌరుషము. మంచి కవిశ్రేష్టులు మెచ్చుకున్నట్టిదే నేర్పరితనము. తగవునకు వచ్చునదియే హాని.
-------000-------

ఇమ్ముగ జదువని నోరును,
నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్‌,
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ.

బావం : ఇంపుగా పఠింపని నోరును, అమ్మయని పిలచి అన్నము అడుగనినోరును, తమ్ముడాయని పిలువనినోరును, కుమ్మరివాడు మన్నుత్రవ్విన గోయీవంటిది సుమా.
-------000-------

ఉడుముండదె నూరేండ్లును,
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌,
మడువున గొక్కెర యుండదె,
కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ

బావం : ఉడుము నూరేండ్లును, పాము పదివందల ఏండ్లును, కొంగ చెరువులో చిరకాలము జీవించుచున్నవి.వాని జీవితములన్నియు నిరుపయోగములు. మానవుని జీవిత మట్టిదికాక ధర్మార్ధకామ మోక్షాసక్తితోకూడినది కావలెను.

Friday, January 16, 2009

సుమతీ శతకం - మూడవ బాగం

అల్లుని మంచితనంబు,
గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్‌,
బొల్లున దంచిన బియ్యము,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ.

బావం: అల్లుని మంచితనమును, గొల్లవాని పాండిత్య జ్ఞానమును, ఆడుదానియందు నిజమును, పొల్లు ధాన్యములో బియ్యమును,తెల్లని రంగు కాకులును లోకములో నుండవు.
-------000-------

ఆకొన్న కూడె యమృతము,
తాకొంచక నిచ్చువాఙ్డె దాత ధరిత్రిన్‌,
సోకోర్చువాడె మనుజుడు,
తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ.

బావం: లోకమునందు ఆకలి సమయమున అన్నమే అమృతము. బాధ నొందకుండా నిచ్చువాడే దాత.ఆవేశమును ఓర్చుకొనువాడే మానవుడు. ధైర్యం కలవాడే వంశ శ్రేష్టుడు.
-------000-------

ఆకలి యుడుగని కడుపును,
వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్‌,
బ్రాకొన్న నూతి యుదకము,
మేకల పాడియును రోత మేదిని సుమతీ.

బావం: భూమియందు ఆకలి తీరని భోజనం, గర్భము వచ్చిన జారస్త్రీ యొక్క వ్యభిచారమును విడువని బ్రతుకును, పాచిపట్టిన బావి నీళ్ళును, మేకల పాడియు రోత పుట్టించును.

Sunday, January 11, 2009

సుమతీ శతకం - రెండవ బాగం

అధరము గదలియు, గదలక
మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ
అధికార రోగ పూరిత
బధిరాంధక శవము జూడ బాపము సుమతీ.

బావం : పెదవి కదలీకదలకుండ తీయనైన మాటలు మాని, మాటలాడనను నియమము పూని, అధికార వ్యాధిచేనిండిన చెవిటి గ్రుడ్డి పీనుగును చూచుట పాపము.
-------000-------


అప్పు కొని చేయు విభవము,
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్‌,
దప్పరయని నృపు రాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ

బావం : ఋణము దెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనమందు పడుచు భార్య, తప్పిదములను కనిపెట్టని రాజు యొక్క రాజ్యము సహింపరానిదై చివరకు హానిని తెచ్చిపెట్టును.
-------000-------


అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్‌
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ.

బావం : ఋణమునిచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడును ఆగకుండా ప్రవహించు నదియును, బ్రాహ్మణుడుగలగ్రామమునందు నివసింపుము. వారు లేనట్టి గ్రామమునందు నివసింపకుము.

Thursday, January 8, 2009

సుమతీ శతకం - మొదటి బాగం

అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ

బావం: అవసరమునకు పనికిరాని చుట్తమును, నమస్కరించి వేడిననూ కోరిక నెఱవేర్చని భగవంతుని,యుద్ధసమయమున ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టవలయును.
-------000-------

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ

బావం: అడిగినప్పుడు జీతము ఈయని గర్వియైన ప్రభువును సేవించి జీవించుటకంటే, నాగలికి వేగముగా పోగల యెద్దులను కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది.
-------000-------

అడియాస కొలువు గొలువకు,
గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్‌
విడువక కూరిమి సేయకు,
మడవిని దోడరకొంటి నరుగకు సుమతీ.

బావం: వృధా ప్రయాసయగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తుత్వము చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయము లేక ఒంటరిగా పోకుము.