Saturday, March 21, 2009

సుమతీ శతకం - పదవ బాగం

కరణము గరణము నమ్మిన 
మరణాంతక మౌను గాని మనలేడు సుమీ;
కరణము దన సరి కరణము 
మరి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ. 
 
బావం :: ఒక లేఖకుడు మఱియొక లేఖకుని నమ్మిన మరణముతో సమానమైన ఆపదను చెందును కావున లేఖకుడైనవాడు తనతో సమానుడైన మఱియొక లేఖరిని విశ్వసింపక తన గుట్టు ఈయక జీవింపవలయును.
-------౦౦౦-------
 
కరణముల ననుసరింపక 
విరసంబున దిన్న తిండి వికటించు జుమీ 
యిరుసున కందెన బెట్టక 
పరమేశ్వరు బండి యైన బారదు సుమతీ.
 
బావం :: బండి యిరుసునకు కందెన పెట్టకున్నచో భగవంతుని బండియైనను త్వరితంగా పరుగెత్తదు. అదే విధముగా లేఖకుడు చెప్పినట్లు విని అతని వెంబడింపక విరోధముతో మెలగినవారు సుఖముగా మన జాలరు.
-------౦౦౦-------
 
కరణము సాదైయున్నను,
గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్‌,
ధర దేలు మీటకున్నను,
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ.
 
బావం :: భూమియందు కరణము నెమ్మదివాడైనను, ఏనుగు మదము పోయినదైననూ, త్రాచు కఱవకున్నను, తేలు కుట్టకున్నను ఆశ్చర్యముతో మిక్కిలి తేలికగా చూతురు.

Friday, March 13, 2009

వేమన శతకం - పదవ బాగం

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళ్కు బెళ్కు రాళ్ళు తట్టెడేల
చాటు పద్య మిలను చాలదా యొకటైన
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: తళతళ మెరిసే రంగు రాళ్లు తట్టెడు ఉండటంకన్నా జాతి నీలమణి ఒక్కటి ఉన్ననూ మన్చిది. ఆ రీతిగనే సారములేని వందలాది పద్యములు చదవడం కంటే సారముగల ఒక్క చాటు పద్యం మేలు.
-------౦౦౦-------

చిత్తశుద్దిగల్గి చేసిన పుణ్యంబు
కొంచెమయున నదియు గొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబున నెంత
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: మంచి మనసుతో చేసిన పుణ్యము కొంచెమైననూ ఫలితం హెచ్చుగా ఉండును. ఎలాగంటే చిన్న మర్రివిత్తనం నుంచి పెరిగిన చెట్టు మహావృక్షం అగును కదా!
-------౦౦౦-------

ప్రియములేని విందు పిండివంటల చేటు  
భక్తి లేని పూజ పత్రి చేటు
పాత్ర మెరుగనీ వి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: ఆప్యాయం లేకుండా వింధుబోజనము పెట్టిన పిండివంటకము వ్యర్థమగును. భక్తిలేకుండా పూజచేసిన పూజాసామగ్రి వ్యర్థం. అదేవిదంగా అర్హతలేనివానికి దానము చేసిన ధనము వ్యర్థం అగును.

Sunday, March 8, 2009

సుమతీ శతకం - తొమ్మిదవ బాగం

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ.

బావం :: కుక్కను తీసుకొని వచ్చి మంచి ముహూర్తమునందు బంగారు గద్దె మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికి దాని నైజగుణము నేలాగున మానలేదో ఆ విధముగనే అల్పుడైనవానికి ఎంత గౌరవముచేసి మంచి పదవొసంగినను తన నీచత్వమును వదలనేరడు.
-------000-------

కప్పకు నొరగాలైనను,
సర్పమునకు రోగమైన, సతి తులువైనన్‌,
ముప్పున దరిద్రుడైనను,
తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ.

బావం :: కప్పకు కాలు విఱిగినను, పాముకు రోగము కలిగినను, భార్య దుష్టురాలైనను, ముసలితనములో దారిద్ర్యము సంభవించినను, ఎక్కువ దుఖప్రదమగును తప్పదు.
-------000-------

కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.

బావం :: కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత తమ మిత్రుడైన సూర్యుని యొక్క ఎండ తాకుడుకే కమలుచున్నవి. అట్లే మానవులు తమ తమ నివాసములను విడిచి పెట్టినచో తమస్నేహితులే తమకు శత్రువులగుదురు.