Saturday, March 21, 2009

సుమతీ శతకం - పదవ బాగం

కరణము గరణము నమ్మిన 
మరణాంతక మౌను గాని మనలేడు సుమీ;
కరణము దన సరి కరణము 
మరి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ. 
 
బావం :: ఒక లేఖకుడు మఱియొక లేఖకుని నమ్మిన మరణముతో సమానమైన ఆపదను చెందును కావున లేఖకుడైనవాడు తనతో సమానుడైన మఱియొక లేఖరిని విశ్వసింపక తన గుట్టు ఈయక జీవింపవలయును.
-------౦౦౦-------
 
కరణముల ననుసరింపక 
విరసంబున దిన్న తిండి వికటించు జుమీ 
యిరుసున కందెన బెట్టక 
పరమేశ్వరు బండి యైన బారదు సుమతీ.
 
బావం :: బండి యిరుసునకు కందెన పెట్టకున్నచో భగవంతుని బండియైనను త్వరితంగా పరుగెత్తదు. అదే విధముగా లేఖకుడు చెప్పినట్లు విని అతని వెంబడింపక విరోధముతో మెలగినవారు సుఖముగా మన జాలరు.
-------౦౦౦-------
 
కరణము సాదైయున్నను,
గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్‌,
ధర దేలు మీటకున్నను,
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ.
 
బావం :: భూమియందు కరణము నెమ్మదివాడైనను, ఏనుగు మదము పోయినదైననూ, త్రాచు కఱవకున్నను, తేలు కుట్టకున్నను ఆశ్చర్యముతో మిక్కిలి తేలికగా చూతురు.

No comments: