Saturday, April 11, 2009

సుమతీ శతకం - పదకొండవ బాగం

కసుగాయ గఱచి చూచిన
మసలక తన యొగరు గాక మధురంబగునా?
పసగలుగు యువతు లుండగ
బసిబాలల బొందువాడు పశువుర సుమతీ!

బావం :: పండిన పండు తినక పచ్చికాయను కొరికినచో వెంటనే వగరు పుట్టును కానీ మధురంగా ఉండదు. అట్లే యవ్వనవతులైన స్త్రీలుండగా పసిబాలలతో సంబోగించుట వికటమనిపించును. ఆట్టివాడు పశువుతో సమానం.
-------00-------

కవిగాని వాని వ్రాతయు
నవరస భావములేని నాతుల వలపుం
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ!

బావం :: నవరస భావములు లేకుండా, కవిత్వము నేర్వని వాడు వ్రాసిన వ్రాతయు, స్త్రీలయొక్క ప్రేమ, తనకు ముందుగా పరుగెత్తుతున్న పండిని కొట్టలేని మానవుని నానవిధ ఆయుధములను వాడుట యందలి నేర్పరితనము వ్యర్థము.
-------000-------

కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్,
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!

బావం :: దుర్జనుడితో స్నేహం చేయరాదు. కీర్తివచ్చినను పిదప నశించదు. అప్పులిచ్చుట తగవులకు మూలము. స్త్రీలకడ కొద్దిమాత్రము కూడా ప్రేమ ఉండదు.

Saturday, April 4, 2009

వేమన శతకం - పదకొండవ బాగం

మృగ మదంబుచూడ మీద నల్లగనుండు
పరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ, దాని సువాసన అంతటా వ్యాపించును. ఆ రీతిగనే మంచివారి గుణములు పైకి గొప్పగా కనిపించకపోయునా అంతటా వ్యాపిస్తాయు.
-------000-------

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెర్రివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: గొప్ప నదులు నిదానంగాను, గంభీరంగానూ ప్రవహించును. కానీ పిల్లవాగులు అతివేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహించును. అట్లే యోగ్యుడు నిదానముగా, గంభీరంగా మాట్లాడును, నీచుడు బడ బడ వాగుచూ ఉండును.
-------000-------

కులములోన నొకడు గుణవంతుడండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: అడవిలో మంచి గంధపు చెట్లున్నచో ఆ అడవి అంతా మంచి వాసనతో వ్యాపించి ఉండును. అట్లే ఒక వంశమునందొక గుణవంతుడు ఉండినచో ఆ వంశము అంతటికీ కీర్తి వచ్చును.