Saturday, April 4, 2009

వేమన శతకం - పదకొండవ బాగం

మృగ మదంబుచూడ మీద నల్లగనుండు
పరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ, దాని సువాసన అంతటా వ్యాపించును. ఆ రీతిగనే మంచివారి గుణములు పైకి గొప్పగా కనిపించకపోయునా అంతటా వ్యాపిస్తాయు.
-------000-------

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెర్రివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: గొప్ప నదులు నిదానంగాను, గంభీరంగానూ ప్రవహించును. కానీ పిల్లవాగులు అతివేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహించును. అట్లే యోగ్యుడు నిదానముగా, గంభీరంగా మాట్లాడును, నీచుడు బడ బడ వాగుచూ ఉండును.
-------000-------

కులములోన నొకడు గుణవంతుడండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: అడవిలో మంచి గంధపు చెట్లున్నచో ఆ అడవి అంతా మంచి వాసనతో వ్యాపించి ఉండును. అట్లే ఒక వంశమునందొక గుణవంతుడు ఉండినచో ఆ వంశము అంతటికీ కీర్తి వచ్చును.

1 comment:

Unknown said...

మధురమైన భావాలతో🙏👏