Saturday, January 31, 2009

సుమతీ శతకం -ఐదవ బాగం

ఉత్తమగుణములు నీచున
కెత్తెఱగున గలుగ నేర్చు,
నెయ్యెడలం దానెత్తిచ్చి కరగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ.

బావం : బంగారమునకు సమానమైన యెత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లు కానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏవిధముగను మంచి గుణములు కలుగనేరవు.
-------000-------

ఉదకము ద్రావెడు హయమును,
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌,
మొదవు కడ నున్న వృషభము,
జదువని యానీచు గడకు జనకుర సుమతీ.

బావం : నీరు త్రాగెడు గుఱ్ఱము కడకును, క్రొవ్వుచే విజృంబించు మదపుటేనుగుకడకును, ఆవుకడనున్న ఆబోతు దగ్గరకును,విద్య నేర్వని అల్పుని కడకును వెళ్ళకుము.
-------000-------

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.

బావం : మేలు చేసినవానికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి లోగడ వాడు చేసిన దోషములులెక్క చేయక ఉపకారము చేయువాడే నేర్పుగలవాడు.

No comments: