Friday, February 6, 2009

సుమతీ శతకం - ఆరవ బాగం

ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ.

బావం :: చెఱకుగడ మొట్టమొదట తియ్యగానుండి, చివరకు పోయిన కొలది మధ్య మధ్య చప్పగా నేవిధమున నుండునో ఆ విధముగా పోల్చి చూడగా మోసగాడైన దుర్మార్గునితోడి స్నేహము మొదట ఇంపుగా నున్ననుచివరకు తప్పులను వెదకుటకు ప్రారంభించునుగదా.
-------000-------

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.

బావం :: ఏ సమయమునకు ఏదేది అవసరమో తెలుసుకొని, అప్పటికా మాటలు పల్కి ఇతరుల మనస్సులను బాధపెట్టక తాను బాధనుపడక తప్పించుకొని తిరుగువాడే సుమా ధన్యాత్ముడు.
-------000-------

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్‌
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ.

బావం :: నల్లత్రాచుయొక్క పడగనీడను నివసించు కప్ప బ్రతుకెంత అస్థిరమైనదో ఆ విధముగనే ఎల్లప్పుడు దోషములనువెదకు యజమానుని సేవించువాడి బ్రతుకును ప్రాణభయముతో కూడినది.

1 comment:

Uyyaala said...

శ్రీధర్ రెడ్డి గారూ,
ఈ తరం మరచి పోతున్న తెలుగు పద్యాలను చక్కగా భావంతో సహా మళ్ళీ గుర్తు చేస్తున్నారు.
అద్దమందు కొండ కొంచమై వుండదా అన్నట్టు సముద్రమంత భావాని నాలుగు చిన్న వాక్యాలలో పొందు పరచడం మన తెలుగు పద్యానికే చెల్లింది.
భర్తృహరి శుభాషితాలు కూడా పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను.
అభినందనలు. .