Sunday, November 30, 2008

వేమన శతకం - ఐదవ బాగం

ఎరుకమాలు వాడు ఏమేమి చదివిన
చదివినంత సేపు సద్గుణియగు
కదిసి తామరాయందు కప్పగూర్చున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: జ్ఞానంలేని వాడు ఎన్నిగొప్పగ్రంధాలు చదివినా చదువుతున్నంతసేపే సచ్చీలుడుగా వెలుగుతాడు. ఎలా? తామరపువ్వులో కప్ప కూర్చొని తాత్కాలిక గౌరవం పొందినట్లు.
-------౦౦౦--------

నీళ్ళలోన ముసలి నిగిడి ఏనుగుబట్టు
బైట కుక్కచేత భంగపడును
స్థాన బలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: నీళ్ళలో ఉన్నప్పుడు మొసలి ఏనుగును సైతం అవలీలగా పట్టుకొంటుంది. అదే నేలమీదకు వచ్చిందా కుక్కకు కూడా లోకువవుతుంది. ఆ బలం గాని , ఈ బలహీనత గాని స్థానం వల్ల వచ్సినవే గాని తన సొంతం కాదు.
-------౦౦౦-------

చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యే
నీట బడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: ముత్యపు చిప్పలో బడిన స్వాతి చినుకు, ముత్యముగా మారుతుంది. నీతి లో బడ్డ చినుకు వ్యర్థం అవుతుంది. ప్రాప్తి ఉంటే తప్పకుండా లాభం కలుగుతుంది.

Monday, November 17, 2008

వేమన శతకం - నాల్గవ బాగం

ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన
నలుపు నలుపే గాని తెలుపు గాదు
కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: ఎలుకతోలు అదేపనిగ సంవత్సరముతికినను తెల్లపడదు. అట్లే చెక్క బొమ్మ తెచ్చి కొట్టినను మాట్లాడదు.
-------౦౦౦-------

గంగి గోవు పాలు గరిటె డైనను జాలు
కడవెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: గాడిద పాలు ఒక కుండ కంటే చిక్కని ఆవుపాలు గరిటెడు మేలైనట్లుగా భక్తితో చేసిన కూడు పట్టెడు చాలును కదా!
-------౦౦౦-------

కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటికాదె
భాషలిట్టే వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: కుండ-కుంభము, కొండ-పర్వతము, ఉప్పు-లవణము అర్థమొక్కటే, భాషలు వేరైనా పరతత్వమొకటె కదా!

Sunday, November 9, 2008

వేమన శతకం - మూడవ బాగం

ఆత్మశుద్ది లేని యాచార మదియేల
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజ లేలరా!
విశ్వదాభిరామ వినుర వేమ.

బావం:: మనస్సు నిర్మాలం గా లేకుండా ఆచారం ఎందుకు?వంటపాత్ర శుబ్రము గా లేని వంట ఎందుకు? స్టిర చిత్తము లేని శివ పూజలు కూడా వ్యర్థమే.
-------000-------

ఆపదైనవేళ నరసి బంధుల జూడు
భయమువేళ జూడు బంటు తనము
పేదవేళ జూడు పెండ్లాము గుణము
విశ్వదాభిరామ వినురవేమ.

బావం:: ఆపదలందు సాయపడువారే బంధువులు. భయములో ఉన్నప్పుడు ధైర్యము వహించు వాడే వీరుడు. బీదతనములో కూడా గౌరవించునదే భార్య!
-------000-------
ఉప్పు కప్పురంబు నొక్కపోలిక నుండు
చూడ చూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం:: ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకేలా ఉంటాయు. రుచిలో మాత్రం తేడా ఉంటుంది. అలాగే పురుషులందు ఉత్తములు వేరుగా ఉంటారు.

Saturday, November 8, 2008

వేమన శతకం - రెండవ బాగం

అనువుగానిచోట నధికులమనరాదు
కొంచమైన నదియు గొదువకాదు
కొండ యద్దమందు గొంచమైయుండదా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం:: తగని చోట గొప్పవారని చెప్పుకోరాదు. తగ్గి యుండుట మంచిది. అద్దములో కొండ చిన్నది గా కనిపించిన మాత్రాన చిన్నదైపోతుందా?
-------000-------
అనగా ననగ రాగ మతిశయుల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.

బావం: పాడుతూ పాడుతూ ఉంటే రాగము వృద్ది అవుతుంది. తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది. అలాగే సాధనము వల్ల ఇలలో పనులన్నీ అవుతాయు.
-------000-------

ఇనుము విరిగేనేని యిరుమారు ముమ్మారు
కాచి యతకవచ్చు గ్రమముగాను
మనసు విరిగేనేని మరి చేర్చరాదయా
విశ్వదాభిరామ వినుర వేమ.


బావం:: ఇనుప వస్తువు విరిగితే రెండు, మూడు సార్లు మళ్ళీ అతకవచ్చు. కానీ మనసు విరిగితే మాత్రం అతకాడం అసాధ్యం.

Thursday, November 6, 2008

వేమన శతకం - మొదటి బాగం

చిన్నతనం లో వేమన పద్యాలు చదవని తెలుగు వాడు ఉండడు అంటే అతిశయోక్తికాదు. మరి అంతటి ప్రాచుర్యం కలిగిన నీతిపద్యాలను మరొక్కసారి మీముందుంచి తెలుగు బాష లోని మాధుర్యాన్నీ అందరికీ పంచడమే నా ఈ చిన్ని ప్రయత్నం. ఈ ప్రయత్నానికి మీరు కూడా తోడ్పాటు అందిస్తూ మీకు తెలిసిన ఎవరికీ అంతగా పరిచయం లేని వేమన, సుమతీ భాస్కర మరియు ఇతర శతక పద్యాలు, అలాగే ఆశువు గా చెప్పబడిన నీతిపద్యాలు నాకు పంపితే ఇక్కడ మీ పేరుతో సహా ప్రచురిస్తాం.


అల్పు డెపుడు పల్కు ఆడంబరము గాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమ.

బావం:విశ్వానికి నీతిని బోదించే ఓ వేమనా! కంచు వస్తువు మోగినట్లు బంగారు వస్తువు మోగదు కదా ! అలాగే నీచుడు ఎపుడూ మంచివానిలా మాట్లాడలేడు